ముగ్గురు మనుషులు.. రెండు మనసులు.. ఒక ప్రేమ.. నిజమైన ప్రేమ… డబ్బుకు, డాబుకు బాబు నిజాయతీ అని నిరూపించిన ప్రేమ కథ.. చిత్ చోర్. టైటిల్‌ని తెనిగీకరిస్తే.. ‘మనసు దొంగ’ అని అర్థం. సరిగ్గా యాభై ఏండ్ల కిందట.. థియేటర్లలో చొరబడిన ఈ మనసు దొంగ… నేటికీ చోరీ చేస్తూనే ఉన్నాడు. టీవీలో ఈ సినిమా వచ్చిన ప్రతిసారీ.. ఇంటిల్లిపాది మనసులూ గెలుచుకుంటూనే ఉన్నాడు. మ్యూజిక్ యాప్స్ ఫేవరెట్ పాటల లిస్ట్‌లలో చేరి.. శ్రోతల మనసులు కొల్లగొడుతూనే ఉన్నాడు. అమోల్ పాలేకర్, జరీనా వహాబ్ జంటగా బాసూ ఛటర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్ చోర్’ అనామకంగా విడుదలై… అద్భుతమైన చిత్రరాజాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
‘గోరీ తేరా గావ్ బడా ప్యారా..
మై తో గయా మారా, ఆ కే యహా రే’
ఏసుదాసు గళం నుంచి జాలువారిన గీతం…
సినిమాలో కథానాయక పాత్ర వినోద్ (అమోల్ పాలేకర్) హార్మోనియం మెట్లు నొక్కుతూ యథాలాపంగా ఆలపించిన ఈ గీతం… ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర కోటి మెట్టు ఎక్కించింది.

మరాఠీ నటుడు అమోల్ పాలేకర్‌కు ఇది మూడో హిందీ సినిమా. బాలీవుడ్‌లోకి రాకముందు రెండు మరాఠీ సినిమాల్లో చేశాడు. హిందీలో మొదటి రెండు సినిమాలు ‘రజనీగంధా’, ‘ఛోటీ సీ బాత్’ సిల్వర్ జూబ్లీ ఆడాయి. ఆ రెండు సినిమాలతో అమోల్ మధ్యతరగతివారికి సుపరిచితుడు అయిపోయాడు. తమతోపాటు ముంబై లోకల్ ట్రైన్లో మొహమాటంగా నిల్చున్న సాటి ప్రయాణికుడిలా అనిపించాడు. పక్కింటి నల్లా దగ్గర నీళ్ల కోసం బకెట్‌తో వెయిట్ చేస్తున్న సగటు యువకుడిగా కనిపించాడు. ఏ ఆర్భాటం లేకుండానే అమోల్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఆ విషయం అమోల్‌కు కూడా అంతగా తెలియదు! అతనికి రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు బాసూ ఛటర్జీ.. ‘చిత్ చోర్’ కథతో అమోల్‌ను సంప్రదించాడు. మధ్య తరగతి మనసులను వెండితెరపై బంగారంగా ఆవిష్కరించే బాసూ ఛటర్జీ మౌఖికంగా కథ చెప్పడంలో చాలా వీక్ అట. నటీనటులకు కథ నెరేషన్ చేయలేక.. స్క్రిప్ట్ ఇచ్చి చదువుకోమని చెప్పడం ఆయనకు రివాజు. అమోల్ చేతిలో ‘చిత్ చోర్’ స్క్రిప్ట్ పెట్టి… చదువుకో అన్నాడట. అది చదివాక.. మనసులోనే ఎగిరి గంతేశాడు అమోల్. కథానాయికగా జరీన్ వహాబ్ ఎంపికైంది. షూటింగ్ పూర్తయింది. సినిమా విడుదలైంది. సంచలన విజయం నమోదైంది.

‘చిత్ చోర్’ పక్కా ప్రేమ కథ. ఈ కథలో విలువలు విడిచే వాళ్లూ ఉన్నారు. ఆ విలువలకు కట్టుబడిన పాత్రలూ ఉన్నాయి. ఆ పాత్రల మధ్య జరిగే సున్నితమైన సంఘర్షణే ‘చిత్ చోర్’. కథలోకి వెళ్తే.. ఓ ఊరిలో ఓ ప్రిన్సిపల్ ఉంటాడు. అతని భార్య నోరు పెద్దది. మనసు కూడా అప్పుడప్పుడూ దొడ్డది అనిపిస్తుంటుంది. ఆ పెద్దాయనకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లకు పెండ్లి చేసి అత్తారింటికి పంపేస్తాడు. మూడో కూతురు గీత (జరీనా వహాబ్)ను కూడా ఓ అయ్య చేతిలో పెడితే.. రిటైర్ అయ్యాక తన భార్య నోటికి మరింత జడుసుకుంటూ శేష జీవితం వెళ్లదీయాలని భావిస్తుంటాడు. ఓ రోజు ఒక ఉత్తరం వస్తుంది. పెద్దల్లుడు రాసిన ఉత్తరం అది.
‘త్వరలోనే మీ ఊరికి తనకు తెలిసిన ఓ పెద్దింటి బిడ్డ వస్తున్నాడు. జర్మనీలో ఇంజినీరింగ్ చదివిన చాకులాంటి కుర్రాడు. ఏదో కాంట్రాక్టు పనిమీద అక్కడికి వస్తున్నాడు. అతనికి ఘనమైన ఆతిథ్యం ఇవ్వండి. ఆ వచ్చిన వాడు గీతను మెచ్చేలా చూడండి. గొప్పింటి సంబంధం మిస్ చేసుకోకండి’ అని లేఖలో హితబోధ చేస్తాడు. ఇంకేం, మధ్యతరగతి ప్రిన్సిపల్ దంపతులు గాల్లో మేడలు కట్టేస్తారు. ఆ వచ్చే ఇంజినీర్ అల్లుడితో ఎలా మసులుకోవాలో.. కూతురుకు హెచ్చరికలు జారీ చేస్తారు.
రెండు రోజుల్లోనే.. ఓ యువకుడు వినోద్ ఊళ్లో దిగుతాడు. ప్రిన్సిపల్ ఏ వివరాలూ అడక్కుండానే అతణ్ని సాదరంగా ఆహ్వానిస్తాడు. అతని కలుపుగోలుతనం, మంచితనం, మాటకారితనం అన్నీ మెచ్చేస్తాడు. ఎంత సంపద ఉన్నా.. అస్సలు గర్వం లేదని మురిసిపోతాడు. ఊళ్లోని పెద్ద డాబా ఇంట్లో మకాం ఏర్పాటు చేసి.. తన ఇంటి నుంచే వంటకాలు పంపుతూ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ఊరిని, ప్రిన్సిపల్ ఫ్యామిలీ ఆదరణ చూసి ముచ్చటపడతాడు వినోద్. గీతను తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఆమె బెట్టు చేస్తుంటే ఈయన మెట్టు దిగుతుంటాడు. కసురుకుంటే.. మురిసిపోతాడు. పంచ్‌లు విరిసితే.. పరవశించిపోతుంటాడు.

వినోద్ సంగీత ప్రియుడు. వినడంలోనే కాదు.. పాడటంలోనూ నేర్పరి. తనకు ఆతిథ్యం ఇచ్చిన ఊరు గురించి ‘గోరీ తేరా గావ్ బడా ప్యారా…’ పాటందుకుంటాడు. గీతకు ఆ పాటంతగా నచ్చదు. ఎందుకంటే.. అప్పటికి వినోద్ మీద ఆమెకు ఎలాంటి అభిప్రాయమూ ఏర్పడదు. నాలుగు రోజులు గడుస్తాయి. గడుగ్గాయి గీత.. సిగ్గుపడటం నేర్చుకుంటుంది. వినోద్లోని భావుకతను ఆస్వాదించడం మొదలుపెడుతుంది. అతని దగ్గర సంగీతం నేర్చుకోవడానికీ ఒప్పుకొంటుంది. ఇప్పుడు వినోద్ బెట్టు చేస్తే.. గీత పట్టువిడుపులు ప్రదర్శిస్తుంటుంది. అతను జోకులు పేలిస్తే.. ఆమె తుళ్లి తుళ్లి నవ్వుతుంది. అలా ఇరు మనసులూ సంగీత-సాహిత్యాల్లా కలిసిపోతాయి. అలా ప్రేమ చిగురించిన తరుణంలో ఓ హృదయ గీతం ఉదయిస్తుంది..

‘తూ జో మేరే సుర్ మే… సుర్ మిలా లే, సంగ్ గా లే’ అంటాడు వినోద్. నా స్వరంలో స్వరమవ్వు, నాతోపాటు గళం కలుపు అని పాటతో విన్నవించుకుంటాడు. గీత అతనితో అలాగే శ్రుతి కలుపుతుంది. ఆ పాటంత మధురంగా తమ జీవితం ఉండబోతుందని కలలు కంటుంది. కండ్ల ముందు గీత-వినోద్ అలా కలియ తిరుగుతుంటే ప్రిన్సిపల్ దంపతులు పొంగిపోతుంటారు. ఇక ముహూర్తాలు నిర్ణయించడం ఒకటే మిగులుతుంది. ఇంతలో మరో తంతి వస్తుంది. అసలు ఇంజినీర్ బాబు అప్పటికింకా తమ ఊరికి రాలేదని, అతను నేడో రేపో వస్తాడని, ఇప్పుడు వచ్చిన వాడు ఆ పెద్దబాబు దగ్గర పనిచేసే చిన్నబాబు అని అందులోని సారాంశం. అది చదవగానే… గీత తండ్రికి అప్పటిదాకా కట్టుకున్న గాలిమేడలు ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపిస్తుంది.
తమ ప్రోత్సాహంతో వినోద్‌కు దగ్గరైన కూతురును అతని నుంచి దూరం చేయాలని నిర్ణయించుకుంటారు. రాబోయే ఇంజినీర్‌కు దగ్గర చేయాలని కూడా భావిస్తారు. మర్నాడే దిగుతాడు ఇంజినీర్ బాబు సునీల్ (విజయేంద్)్ర. టిప్‌టాప్‌గా ఉంటాడు. దర్పం ప్రదర్శిస్తుంటాడు. వినోద్‌కు మనసిచ్చిన గీత.. సునీల్ వంక కన్నెత్తి చూడదు. తల్లిదండ్రులు సాధిస్తూ ఉంటారు. జలపాతంలా హుషారుగా ఉండే గీత… ఈ సంఘర్షణతో స్తబ్ధుగా మారిపోతుంది. వినోద్ పట్ల ప్రిన్సిపల్ దంపతులు నిరాదరణ చూపుతుంటారు. సునీల్బాబుతో గీత పెండ్లి ఖాయం చేయడానికి పావులు కదుపుతుంటారు. కానీ, స్వచ్ఛమైన ప్రేమ ఈ ఆటంకాలను అధిగమిస్తుంది. నిజాయతీ నిలుస్తుంది. గీత-వినోద్ ప్రేమ కొత్త చిగురు తొడుగుతుంది. వారిద్దరి పెండ్లితో కథ సుఖాంతం అవుతుంది.

ఈ తరహా చిత్రాలు అనేకం రావొచ్చు. కానీ, చిత్ చోర్‌లో పాత్రల తీరుతెన్నులు కొలిచినట్టుగా కుదిరాయి. మాటలు పిల్లకాల్వలా మృదువుగా సాగిపోతాయి. పాటలు మలయమారుతంలా గుండెను స్పృశిస్తాయి. ఎందుకు స్పృశించవు? ఆ పాటలు పాడింది ఆ మలయాళ సీమ నుంచి వీచిన ఏసుదాసు కదా! ఆయనకు జోడీగా హేమలత గొంతు కలిపింది. అందుకే, చిత్ చోర్ సినిమాలో పాటలన్నీ మెగాహిట్ అయ్యాయి. పైన చెప్పుకొన్న రెండుపాటలతోపాటు.. ‘జబ్ దీప్ జలే ఆనా.. జబ్ శామ్ ఢలే ఆనా’, ‘ఆజ్ సే పెహలే.. ఆజ్ సే జ్యాదా..’ ఈ రెండు పాటలు కూడా ఎవర్గ్రీన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నవే! ఈ పాటలకు ఇంత చక్కని సంగీతాన్ని కూర్చిన రవీంద్ర జైనే సాహిత్యం కూడా అందివ్వడం మరో విశేషం. ‘గోరీ తేరా గావ్..’ పాటకు గాను ఏసుదాస్ ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.
చివరిగా.. ఈ సినిమా 1976 జనవరి 30న విడుదలైంది. తక్కువ ప్రింట్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబై విషయానికి వస్తే.. ఆ మహా నగరంలో కేవలం ఒకే ఒక థియేటర్లో చిత్రాన్ని విడుదల చేశారు. ఇదేంటని దర్శకుడు వాపోతే.. ‘ప్రేక్షకుల దగ్గరికి మన సినిమా వెళ్లడం కాదు.. మన సినిమాను వెతుక్కుంటూ ప్రేక్షకులే వస్తారు చూడు!’ అన్నాడట నిర్మాత. అన్నట్టే… ‘చిత్ చోర్’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వంద రోజుల తర్వాత ముంబైలో మరిన్ని థియేటర్లలో రిలీజై… సిల్వర్ జూబ్లీ ఆడింది. సరదాగా.. చిత్ చోర్ చూడండి. అమోల్ పాలేకర్ సహజ నటనకు ముచ్చటపడతారు. జరీన్ వహాబ్ చూపించిన పరిణతికి ఫిదా అవుతారు. అన్నిటికీ మించి ఏసుదాసు పాడిన పాటలు వింటూ… ‘ఆజ్ సే పెహలే.. ఆజ్ సే జ్యాదా.. ఖుషీ ఆజ్ తక్ నహీ మిలీ’- ఇంతటి ఆనందం ఇంతకు మునుపెన్నడూ కలగలేదని తృప్తి చెందుతారు.
– కణ్వస