Payal Rajput | వెండితెర మేఘమైతే.. దానిపై మెరిసిన మెరుపు తీగ పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. మొదటి చిత్రంతో హాట్ బ్యూటీగా గుర్తింపు పొందిన ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోయింది. కానీ, కొందరు పనిగట్టుకొని తనను తప్పుదోవ పట్టించడంతో మోసపోయానని చెబుతున్నది పాయల్. ఇటీవల ‘మంగళవారం’ హిట్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ నటి తాజాగా ‘రక్షణ’ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు అందాల విందు చేయనుంది. హిట్ హీరోయిన్గా పేరొచ్చినా.. కెరీర్లో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న ఈ హాట్ హీరోయిన్ పంచుకున్న కబుర్లు ఇవి..
కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ‘ఆర్ఎక్స్ 100’ కథలో భాగంగానే శృంగార సన్నివేశాలు ఉన్నాయి. కానీ, కథలో లేకున్నా.. అనవసరంగా అలాంటి సన్నివేశాలు జొప్పిస్తే మాత్రం ఒప్పుకోను.
కెరీర్ మొదట్లో పంజాబీ టెలీ సీరియల్స్, సినిమాల్లో నటించాను. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘సైరత్’ చిత్రం పంజాబీ రీమేక్ నాకు మంచి గుర్తింపునిచ్చింది. ఆ చిత్రంలో నా నటనకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఇక టాలీవుడ్లో ‘ఆర్ఎక్స్ 100’ సాధించిన సక్సెస్ నాకు వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది.
ఇలియానా, అనుష్కశెట్టి అంటే ఇష్టం. పవన్‌కళ్యాణ్ చిత్రాలు ఎక్కువగా చూస్తాను. అవకాశం వస్తే మహేశ్‌బాబు, ప్రభాస్ సినిమాల్లో చేయాలని ఉంది. ప్రభాస్ నా ఫేవరెట్. ఆయనకు లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. తను ఏది అడిగితే అది చేసిపెట్టాలని నా కోరిక. రాజ్మా రైస్ నాకు నాకు చాలా ఇష్టం. దాన్ని నేనే స్పెషల్‌గా వండి నా చేత్తో ప్రభాస్‌కు తినిపించాలని ఉంది. అలాంటి చాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోను.
నేను ఎలాంటి పాత్రలు పోషించాలన్నది ప్రధానం కాదు. స్క్రిప్టులో బలం ఉండాలి. కథ లేకుండా, ఎలాంటి పాత్ర చేసినా ఫలితం శూన్యమే. ముందుగా కథ, నా పాత్ర నచ్చాలి. డైరెక్టర్ మంచివాడై ఉండాలి. అలాంటి సినిమాలే ఒప్పుకొంటాను. బలమైన కథతో రూపొందే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని ఉంది. కథ నచ్చితే రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోను.
నేను ఏ పనిచేసినా 200 శాతం ఎఫర్ట్స్ పెడతాను. అయితే ఒక్కోసారి మనం ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అది డెస్టినీ అనుకుంటాను. ‘ఆర్ఎక్స్ 100’ సక్సెస్‌ను నేను సద్వినియోగం చేసుకోలేదనే చెప్పాలి. ఆ టైమ్‌లో చాలామంది నన్ను మిస్లీడ్ చేశారు. ఇప్పుడు తత్వం బోధపడింది. ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు లాంటి విషయాలు తెలిసొచ్చాయి. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టు ఓకే చేయడానికి ముందు ఇవన్నీ ఆలోచిస్తాను. నా జాగ్రత్తలో నేనుంటాను.