Upasana | తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ప్రకటించిన కొత్త స్పోర్ట్స్ పాలసీలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, క్రీడా నిపుణులకు కీలక పాత్రలు అప్పగించింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు గౌరవనీయమైన బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రకటించిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కు ఉపాసన కో-చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ బోర్డుకు లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకా ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, కో-చైర్మన్ బాధ్యతలు ఉపాసన చేపట్టనున్నారు.
ఆమెతో పాటు ఈ బోర్డులో ఇతర ప్రముఖులను కూడా సభ్యులుగా నియమించారు. వీరిలో సన్ టీవీ నెట్వర్క్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ , లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ , బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ , ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా , ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా , రవికాంత్ రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల స్పందిస్తూ, “తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈ బాధ్యత నాకు లభించడం గర్వంగా ఉంది. నన్ను ఈ స్థాయిలో నమ్మి అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యం ద్వారా క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది ఒక మైలురాయి అవుతుంది అని ట్వీట్ చేశారు.
అయితే తన కోడలికి దక్కిన ఈ గౌరవం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కి కో చైర్ పర్మన్. ఆమెని గౌరవప్రదమైన పదవిలో నియమించడం చాలా సంతోషంగా ఉంది. దీనిని గౌరవం అనడం కన్నా మరింత బాధ్యతని పెంచింది అని చెప్పాలి. డియర్ ఉపాసన.. నీకున్న నిబద్ధత, ప్యాషన్‌తో ప్రతిభని గుర్తించి ప్రోత్సహిస్తావని, ప్రతిభావంతులని అగ్రస్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలని రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. దేవుడి దీవెనలు నీకు తోడుగా ఉంటాయని చిరు పేర్కొన్నారు.