Chiru – Venki | ప్రతియేటా జరుగుతున్న ఎయిటీస్ క్లాస్ రీయూనియన్ పార్టీ ఈసారి కూడా ఫ్యాన్స్‌కి మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు గతాన్ని గుర్తు చేసుకుంటూ, వయసుతో సంబంధం లేకుండా ఒకే వేదికపై సందడి చేశారు. ఈ పార్టీ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన డ్రెస్ కోడ్ ధరించి, వారందరూ ఓ మాస్ లుక్‌లో మెరిసిపోవడం, వాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదంతా అభిమానులను ఓ పండుగ వాతావరణంలోకి తీసుకెళ్లింది. అయితే ఈ ఏడాది రీయూనియన్‌లో ఒక ఫోటో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి ‘కొండవీటి దొంగ’ లుక్‌లో, వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’ స్టైల్లో కనిపించడంతో అభిమానులు ఫిదా అయ్యారు.
చిరంజీవి ధరించిన డిజైనర్ షర్ట్ మీద కనిపించిన చిరుతపులి ప్రింట్, ఆయన శరీర భాష అంతా కలసి అభిమానులను నేరుగా ‘కొండవీటి దొంగ’ (1990) సినిమా రోజుల్లోకి తీసుకెళ్లింది. ఈ సినిమాలో చిరు అడవి జీవితాన్ని గౌరవిస్తూ, సామాజిక బాధ్యతలు వహించే రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. దానికి తగ్గట్టే ఈ లుక్‌ను ఎంపికచేసిన చిరంజీవి, మరోసారి తన స్టైల్‌తో మంత్ర ముగ్ధులని చేశారు.ఇక చిరు పక్కనే వెంకటేష్ కూడా తన క్లాసిక్ లుక్‌లో మెరిశారు. ట్రేడ్‌మార్క్ హ్యాట్, పులి ప్రింట్ వైట్ టీషర్ట్‌పై కోట్ వేసుకుని బొబ్బిలి రాజా స్టైల్‌తో కనిపించారు. 1990లో వచ్చిన ఈ చిత్రంలో వెంకీ చిలిపి రాజాగా నటించి మాస్ ప్రేక్షకులను అలరించారు. బి.గోపాల్ దర్శకత్వం, పరుచూరి బ్రదర్స్ మాటలు, ఇళయరాజా సంగీతం ఆ సినిమాకు బలమయ్యాయి.
ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో, నెటిజన్లు “కొండవీటి దొంగతో బొబ్బిలి రాజా” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.ఇదే ఫ్రేమ్‌ను చూసి ఊహల్లోకి వెళ్లిన ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ సినిమా కోసం కలవాలని కోరుకుంటున్నారు. తాజా వార్తల ప్రకారం, అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మన శివశంకర వరప్రసాద్ గారు” చిత్రంలో వెంకటేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. అక్టోబర్ నుంచి వెంకీతో సన్నివేశాల చిత్రీకరణ మొదలవుతుందనే వార్తలు వస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.