Chiru-Karthik | మిరాయ్’ సినిమాతో సినీప్రపంచాన్ని ఊపేసిన యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కింది. దర్శకుడిగా తన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కెమెరామెన్‌గా ఎంపిక కావడం గర్వకారణంగా మారింది. సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదలైన మిరాయ్ సినిమా, తొలి రోజే రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. రెండో రోజుకే వసూళ్లు రూ.55 కోట్లను దాటి వెళ్లాయి. ఈ విజయం వెనుక కార్తీక్ ఘట్టమనేని కీలక పాత్ర పోషించాడు. అందుకు కారణం ఆయన ఈ సినిమాకి దర్శకుడిగాను, సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు.
తాను రాసుకున్న కథను స్క్రీన్ మీద అదిరిపోయే విజువల్స్‌తో చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అందరి నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు చిరు సినిమాకి పని చేసే అవకాశం కూడా అందుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో “వాల్తేరు వీరయ్య” సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబోలో మరో సినిమా రాబోతుంది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకు కెమెరామెన్‌గా కార్తీక్ ఘట్టమనేనిని ఫైనల్ చేశారునే టాక్ నడుస్తుంది.
దర్శకుడు బాబీ చెప్పిన కథకు విజువల్‌గా ఆ స్థాయి కిక్ రావాలంటే కార్తీక్‌ను మించేవాడు లేడనే నమ్మకంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇక కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం , మెగాస్టార్ పర్ఫార్మెన్స్తో సినిమా మరో లెవెల్‌కు వెళుతుందని ముచ్చటించుకుంటున్నారు. యువతలో టాలెంట్ ఉంటే, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే మరోసారి నిరూపణ అయ్యింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తకి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది.