ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో కిశోర్ అన్నపురెడ్డితో కలిసి నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. ‘పెదకాపు’ఫేం విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన అగ్ర కథానాయకుడు చిరంజీవి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, తలసాని శ్రీనివాసయాదవ్ కెమెరా స్విచాన్ చేశారు. అజయ్ భూపతి తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఎషియన్ సునీల్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. సినిమా బాగా రావాలని, మంచి విజయాన్ని సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. దేశంలోని 108 విష్ణు దేవాలయాల్లో గుప్త నిధులు నాగబంధాల ద్వారా రక్షించబడుతున్నాయని, ఈ సినిమా కథ ఈ నేపథ్యంలోనే సాగుతుందని, డివైన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో కూడిన అద్భుతమైన స్క్రిప్ట్ ఇదని అభిషేక్ నామా తెలిపారు. ఇంకా యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీశర్మ, బి.ఎస్.అవినాష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కల్యాణ్ చక్రవర్తి, కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: అభే, సహ నిర్మాత: తారక్ సినిమాస్, సమర్పణ: లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా, నిర్మాణం: ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్, కథ, కథనం, దర్శకత్వం: అభిషేక్ నామా.