Chiru- Anil | మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రంకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. కాని దాని తర్వాత సెట్స్ పైకి వెళ్లిన అనీల్ రావిపూడి చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం మెగా అభిమానుల్లోనే కాకుండా, తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌పై వదంతులు జోరుగా వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ ఈ సినిమాలో తన అసలు పేరు ‘శివశంకర్ వరప్రసాద్’ పేరుతో పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సంక్రాంతి రిలీజ్ కావడంతో పండుగ నేపథ్యానికి తగ్గట్టుగా టైటిల్ ఉంటుందంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా ‘మన శంకర్ వరప్రసాద్ గారు…’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ టైటిల్‌తో చిరు మంచి హిట్ కొట్టడం గ్యారెంటీ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి మరో హైలైట్.. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్. ఇటీవలే ఈ విషయాన్ని వెంకటేష్ స్వయంగా ప్రకటించారు.
చిరంజీవి పాత్ర డ్రిల్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్ అని తెలిసినప్పటి నుంచి వెంకటేష్ పాత్రపై కూడా ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటికే ముస్సోరిలో కీలక సీన్లు షూట్ కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అదే రోజు టైటిల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నారట. అయితే దీనికి సంబంధించి భారీ వేడుకని ప్లాన్ చేస్తున్నారని, అలానే ప్రమోషనల్ కార్యక్రమాలని కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీపై క్రేజ్ ఎలా ఉందంటే… షూటింగ్ పూర్తికాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు రూ. 55–60 కోట్ల మధ్య డీల్ క్లోజ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంతోనే ప్రైమ్ ఈ బిగ్ డీల్‌కు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా, గణేష్, బలగం మురళీధర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు .. ఈ భారీ కామెడీ ఎంటర్టైనర్ను 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.