చిరంజీవి సినిమా అంటే.. అందమైన ఇద్దరు హీరోయిన్లుండాలి. అదిరిపోయే బీట్ ఉన్న పాటలుండాలి. అదరహో అనిపించే స్టెప్పులుండాలి. మెగా టైమింగ్‌కి తగ్గట్టు డైలాగులుండాలి.. ఈవన్నీ ఉంటేనే అది చిరంజీవి సినిమా. కానీ మెగాస్టార్ ఇవేమీ లేకుండా ప్రయోగాత్మక సాహసానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. ఆ తర్వాత ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెల సినిమా చేస్తారు చిరంజీవి. ఈ సినిమా విషయంలోనే చిరంజీవి ప్రయోగం చేయనున్నారని తెలుస్తున్నది. ఈ సినిమా కమల్‌హాసన్ ‘విక్రమ్’ తరహాలో ఉంటుందట. ఇందులో ఫైట్లు తప్ప డాన్సులు, హీరోయిన్లతో ఆటపాటలు, కామెడీ ఇలాంటివేం ఉండవంట. చిరు క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని, మెగా అభిమానులు పండుగ చేసుకునేలా క్యారెక్టరైజేషన్ ఉంటుందని సమాచారం.