ఏడు పదుల వయసులో కుర్రహీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. వాటిలో వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రం రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక మరో సినిమా ‘మెగా 157’ సంక్రాంతి రిలీజ్ కోసం చకచకా చిత్రీకరణ జరుపుకుంటున్నది. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో జనరంజకంగా సినిమాను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.
ఇదిలావుంటే.. పనిలోపనిగా తన 158వ సినిమాకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు మెగాస్టార్. బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ను తనకిచ్చిన కేఎస్.రవీంద్ర(బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. సెప్టెంబర్‌లో ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నట్టు తెలుస్తున్నది. కార్తీక్ ఘట్టమనేని ఈ పానిండియా చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారట. ఈ సినిమా నిర్మాత, తదితర విషయాలు తెలియాల్సివుంది.