అగ్ర హీరో చిరంజీవి నటించనున్న 157వ చిత్రాన్ని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించనున్నారు. ‘అంజి’ (2004) తర్వాత మరలా చిరంజీవి సోషియో ఫాంటసీ కథాంశంతో సినిమా చేస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది.
చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. పంచభూతాల కథతో భారీ గ్రాఫిక్స్ హంగులతో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ తుది దశకు చేరుకుందని తెలిసింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.