Chiranjeevi | తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తాజాగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాకు అవార్డులు వరించాయి. బాలకృష్ణ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ‘ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలనచిత్రం’ అవార్డును గెలుచుకుంది. అలాగే ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ సోషియో ఫాంటసీ ‘హను-మాన్’.. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగం లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ‘బేబీ’కి బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ సింగింగ్ అవార్డులు దక్కాయి. ఉత్తమ బాలనటి కేటగిరిలో ‘గాంధీతాత చెట్టు’ సినిమా నుంచి సుకృతివేణి అవార్డుకు ఎంపికైంది. తెలుగు చిత్రాలు సత్తా చాటిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో జాతీయ అవార్డ్ గ్రహీతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది.. ” అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు చిరంజీవి.అలానే బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అలానే తన పోస్ట్‌లో అవార్డులు గెలుచుకున్న వారికి సంబంధించిన లిస్ట్ కూడా పెట్టారు.
ఉత్తమ చిత్రం గా ’12th ఫెయిల్ ఎంపికైంది. ఉత్తమ నటుడు విభాగంలో షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సీ (12th ఫెయిల్) ఈ ఇద్దరూ అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకత్వం విభాగంలో సుధీప్తో సేన్ (ది కేరళ స్టోరీ) అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది తెలుగు సినిమాకూ విశేష గౌరవం లభించింది. తెలుగు టాలెంట్‌తో రూపొందిన సినిమాలకు 10కి పైగా జాతీయ అవార్డులు లభించడం గర్వించదగిన విషయం. తెలుగు సినిమా విజేతలకు ప్రత్యేక అభినందనలు. ఉత్తమ తెలుగు చిత్రం – ‘భగవంత్ కేసరి, ఉత్తమ AVGC చిత్రం – ‘హనుమాన్’ టీమ్, ఉత్తమ కథా చిత్రం స్క్రీన్‌ప్లే – సాయి రాజేష్ (బేబీ), ఉత్తమ బాల నటుడు/నటి – సుకృతి బండి రెడ్డి (గాంధీ తాత చెట్టు), ఉత్తమ యాక్షన్ దర్శకత్వం – నందు, పృథ్వీ (హనుమాన్), ఉత్తమ గీత రచయిత – కాసర్ల శ్యామ్ (ఊరు పట్టణం పాట – బలగం), ఉత్తమ సంగీత దర్శకులు: జీవీ ప్రకాష్ కుమార్ (వాథీ), హర్షవర్ధన్ రమేశ్వర్ (యానిమల్), ఉత్తమ నేపథ్య గాయకులు రోహిత్ (‘ప్రేమిస్తున్నా’ – బేబీ).. ఈ గొప్ప గౌరవం సాధించిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా అభినందనలు. భారతీయ సినిమాకి ఈ అవార్డులు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని చిరు అన్నారు.