Chiranjeevi | పదవులు, ఖ్యాతి, పేరు ఎంత ఉన్నా.. తల్లి ముందు మాత్రం ప్రతి కొడుకు చిన్నవాడే. అదే విషయాన్ని మరోసారి నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మంది అభిమానులకు ఆయన లెజెండ్ అయినా, తన తల్లి అంజనా దేవి ముందు మాత్రం ఒక సాధారణ కుమారుడిగా మారిపోతారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు అభిమానులను హత్తుకుంటోంది. ఈరోజు (జనవరి 29) అంజనా దేవి పుట్టినరోజు కావడంతో, చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “అమ్మా.. నీ ఆశీర్వాదమే నా బలం. పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ ఎమోషనల్ మెసేజ్‌ను పంచుకున్నారు. ఈ సందేశంతో పాటు ఒక ప్రత్యేక వీడియోను కూడా అభిమానులతో షేర్ చేశారు.
ఆ వీడియోలో మెగా కుటుంబ సభ్యులందరితో కలిసి అంజనా దేవి గడిపిన అరుదైన క్షణాలు, కుటుంబ వేడుకల ఫోటోలు, మధురమైన జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి. ఈ విజువల్స్ అభిమానులను మాత్రమే కాదు, సామాన్య ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. వీడియో విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ అంజనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి తన తల్లిపై ఉన్న ప్రేమను ఎప్పుడూ దాచుకోరు. ప్రతి ఏడాది ఆమె పుట్టినరోజు, మదర్స్ డే వంటి సందర్భాల్లో తప్పకుండా ఆమెను గుర్తు చేసుకుంటారు. షూటింగ్‌లు, రాజకీయ కార్యక్రమాలు, ఇతర బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా.. తల్లితో సమయం గడపడానికి చిరు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని సన్నిహితులు చెబుతుంటారు. కుటుంబ విలువలు, క్రమశిక్షణ, ఓర్పు, సహనం వంటి గుణాలు తన తల్లి నుంచే నేర్చుకున్నానని చిరంజీవి పలు సందర్భాల్లో వెల్లడించారు.
మెగా కుటుంబానికి అంజనా దేవి ఒక అండగా, ధైర్యంగా ఉంటారని చిరు ఎప్పుడూ చెబుతుంటారు. గత ఏడాది కూడా ఆమె పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. కొణిదెల వెంకట్రావు – అంజనా దేవి దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడైన చిరంజీవి సినీ రంగంలో తిరుగులేని మెగాస్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రాంతీయ చిత్ర పరిశ్రమలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించారు. రెండో కుమారుడు నాగబాబు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ప్రజాసేవ కొనసాగిస్తున్నారు. మూడో కుమారుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
అమ్మా ❤️
నీ ఆశీర్వాదమే నా బలం.పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏💐 pic.twitter.com/5cyGDMAhDw
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2026