Vishwambhara | అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న‘విశ్వంభర’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఓ దైవిక కార్యం నెరవేర్చడానికి భువిపై అడుగుపెట్టిన కారణజన్ముడికి, విశ్వంభర అనే లోకానికి మధ్య ఉండే సంబంధం, కార్యసాధనలో తను చేసే ప్రయాణం నేపథ్యంలో ఆద్యంతం సాహసం, సంభ్రమం కలబోతగా దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలో విహరింపజేసే చిత్రమిదని, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో టీజర్ ఎప్పుడొస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 12న దసరా పర్వదినం సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ప్రేక్షకులకు విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేస్తారని చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.