‘దసరా’ సినిమాతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. నాని కథానాయకుడిగా సింగరేణి నేపథ్య కథాంశంతో రూపొందిన ఈ సినిమా వందకోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం నానితోనే ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఇదిలావుండగా ఈ యువ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. గతకొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ విషయమై సోషల్‌మీడియాలో వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ మెగా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరో నాని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విడుదల చేసిన పోస్టర్లో ‘అతను హింసలోనే శాంతిని వెతుకుతాడు’ అనే క్యాప్షన్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని క్యాప్షన్‌ను చూస్తే అర్థమవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.