Chiranjeevi | సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ మరింత పెంచారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను దూకుడు పెంచింది. తాజాగా మూవీ రిలీజ్‌కి కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉందని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. ఇందులో చిరు కొబ్బరి బోండం తాగుతూ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిరు ఫ్యాన్స్ ఈ పోస్టర్ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే అమెరికాలో ఈ సినిమా బుకింగ్స్ అధికారికంగా ఓపెన్ చేసినట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన యూఎస్ ప్రీమియర్స్ జనవరి 11న అత్యంత గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగకు ముందే బాక్సాఫీస్ బజ్ స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ ప్లాన్ చేశారు. పండగ మూడ్‌ను సెట్ చేసేలా ప్రీమియర్స్‌ను డిజైన్ చేయడంతో ఓవర్సీస్లో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సరిగామ సినిమాస్ ఈ చిత్రాన్ని విదేశాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. . అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి చిరంజీవి మాస్ ఇమేజ్, కామెడీ టైమింగ్ కలిస్తే వచ్చే ఎంటర్టైన్మెంట్పై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై బజ్ మామూలుగా లేదు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో రికార్డుల వేట మొదలైనట్లే అని అభిమానులు భావిస్తున్నారు. జనవరి 11న ప్రీమియర్స్‌తోనే సినిమా రేంజ్ ఏంటో తేలిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఈసారి సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారింది. తనదైన స్టైల్, స్వాగ్తో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి విన్నర్‌గా నిలిచి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.