Chiranjeevi | అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు తమ తల్లులతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా భావోద్వేగభరిత సందేశంతో అభిమానులను ఆకట్టుకున్నారు. అమ్మ గొప్పతనం, త్యాగం గురించి హృదయాన్ని హత్తుకునేలా పేర్కొంటూ ప్రపంచంలోని తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ… మన మొదటి గురువు, మన మొదటి ధైర్యం, కనిపించే దైవం కూడా ‘కని పెంచిన’ మాతృమూర్తి తర్వాతే. మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందేశంతో పాటు తన కుటుంబానికి సంబంధించిన కొన్ని అరుదైన త్రోబ్యాక్ ఫొటోలను కూడా షేర్ చేశారు. ఆ ఫొటోలలో చిరంజీవి తల్లి అంజనా దేవి, తండ్రి వెంకట్రావు, అలాగే పవన్ కళ్యాణ్, నాగబాబు మరియు కుటుంబ సభ్యులు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ పిక్స్‌ను భారీగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో చిరంజీవి కెరీర్లో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
అమ్మ…
మన మొదటి గురువు,
మన మొదటి ధైర్యం,
కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…!మన విజయాల వెనక త్యాగం…
మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది.మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Happy… pic.twitter.com/SJ1AchhEPz— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2026