Chiranjeevi | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇండస్ట్రియలిస్టులు, టాప్ బిజినెస్ లీడర్లు, సినీ ప్రముఖులు భారీ ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు, ‘విజన్ 2047’ లక్ష్యాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.ఈ సమ్మిట్‌లో అత్యంత ఆకర్షణీయమైన క్షణాల్లో ఒకటి ఆనంద్ మహీంద్రా, చిరంజీవి మధ్య జరిగిన స్నేహపూర్వక ముచ్చట. దీనికి సంబంధించిన ఫోటోను మహీంద్రా స్వయంగా సోషల్ మీడియా (X) లో షేర్ చేస్తూ మెగాస్టార్‌ను ఆకాశానికెత్తేశారు.
“తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. విజన్ 2047 గురించి సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించాను. చివర్లో మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం ఊహించని సర్ప్రైజ్. ఆయన ఒక లెజెండ్. కానీ ఆయనలో ఉన్న వినయం, నిజమైన ఆసక్తి మరింత ఆకట్టుకున్నాయి. నేర్చుకోవాలనే ఉత్సుకత, వినయంతో వినడం ఏ రంగంలోనైనా శాశ్వత విజయానికి పునాది అని రాసుకొచ్చారు. ఇక మహీంద్రా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే మహీంద్రా కామెంట్‌పై చిరు కూడా స్పందించారు.
డియర్ ఆనంద్ మహీంద్రా మీరు ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం ఎంతో ఆదర్శనీయం. మీరు చాలా సార్లు రతన్ టాటాని గుర్తుకు తెస్తారు. ఆయన తన విలువతో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. మీరు కూడా అలానే. సేవా కార్యక్రమాలలో మీరు చూపుతున్న నిబద్థత ఎంతో మందికి ఆదర్శం. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చిరంజీవి అన్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు చిరు.