Chiranjeevi | పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 2025 జులై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. సామ్రాజ్యంలో ప్రజలను హింసిస్తున్న మొఘల్ రాజులను అంతమొందించే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కనిపించనున్నారు.. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు. సినిమాలో అన్ని పాత్రలు అంచనాలను మించి ఉన్నాయి. ముఖ్యంగా పవన్ లుక్ అదిరిపోయింది. పవన్ చేతి మీద ఉన్న పచ్చబొట్టు వీరమల్లు భక్తిని చాటుతుండడం విశేషం.
హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం’ అంటూ పవర్ ఫుల్ వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరికి నచ్చేసింది. ముఖ్యంగా ట్రైలర్ చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి మీద ప్రశంసల జల్లు కురిపించారు. వాట్ యాన్ ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్ అంటూ సోషల్ మీడియాలో స్పందించిన చిరు, ఈ పోస్ట్‌తో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేశారు.దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత కల్యాణ్ బాబు వెండితెరపై మళ్లీ అగ్నికణాలు చిమ్మడం చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఈ ట్రైలర్లో కళ్యాణ్ ఎనర్జీ, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి అని పేర్కొన్నారు.
నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, నటీనటులు బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్‌లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు చిరంజీవి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో మాస్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అయితే కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు.