Chiranjeevi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్లో గాయపడ్డాడన్న వార్త అభిమానులను ఎంతగా కలవరపరిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన కంటికి గాయం కావడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా హెల్త్ అప్డేట్ ఇచ్చారు. “ఈ క్లిష్ట సమయంలో చరణ్ కనురెప్పకు అత్యంత నైపుణ్యంతో చికిత్స అందించిన వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మొదట కొంత ఆందోళన ఉన్నప్పటికీ, వైద్యుల భరోసా మాకు ధైర్యం ఇచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
చిరంజీవి చేసిన ఈ ప్రకటనతో మెగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఇక ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గాయం కారణంగా రామ్ చరణ్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోనున్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్లో పెద్ద మార్పులు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఏప్రిల్ 30న సినిమా విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ వేగంగా పనులు కొనసాగిస్తున్నారు.
ఇది చిన్న గాయం అయినప్పటికీ, అభిమానుల్లో ఆందోళన కలిగించిన ఈ ఘటనపై స్పష్టత రావడంతో ఇప్పుడు అందరూ చరణ్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొనాలని ఆశిస్తున్నారు. ఇక రీసెంట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా చరణ్ గాయం గురించి ట్వీట్ చేయడం మనం చూశాం. మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు కూడా చేస్తున్నారు.