Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మంది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. 45 ఏళ్లుగా సినిమాలు చేస్తోన్న చిరంజీవి మొత్తం 156 సినిమాల్లో 537 పాటలకు గానూ 24 వేల డ్యాన్స్ స్టెప్పులు వేసి రికార్డు సృష్టించారు. తన ప్రతిభకు ప్రతీకగానే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.. పసివాడి ప్రాణం చిత్రంలో బ్రేక్ డ్యాన్స్ వేసి కొత్త ఒరవడిని తీసుకొచ్చిన చిరంజీవి కొండవీటి దొంగలో స్లోమోషన్ డ్యాన్స్ వేస్తూ మరో ఒరవడిని పరిచయం చేశారు.
గ్యాంగ్ లీడర్ లో వానా వానా వెల్లువాయె పాటలో స్టెప్స్ మరో హైలైట్. ఏ స్టెప్పునైన అవలీలగా చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉండే చిరంజీవి..ఓ సినిమా షూటింగ్ స్పాట్లో కళ్లు తిరిగి పడిపోయారు. ఆ సినిమా మరేదో కాదు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాతగా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా కంటే ముందు పాటల షూటింగ్ చేసారు, కానీ చిత్రానికి కీలకమైన ఒక పాట తీయడం మిగిలి ఉంది. అయితే పాట లేకుండా సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు కాని సినిమాలోని కథకి పాట లింక్ అవుతుంది. దీంతో తప్పనిసరిగా పాటని షూట్ చేసి సినిమాలో కలిపి విడుదల చేశారు.
అయితే ఆ సమయంలో చిరంజీవి తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. మలేరియా సోకడంతో విశ్రాంతి తీసుకుంటున్న చిరంజీవి పాట కోసం జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా 103 డిగ్రీలు ఉన్నప్పటికీ పాట షూటింగ్లో పాల్గొంటాను అని పట్టుబట్టి షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ జరిగే సమయంలో ఎన్నోసార్లు అదుపుతప్పి కింద పడిపోయారు. షూటింగ్ కు వచ్చేటప్పుడు ఆయనతోపాటు ఒక వైద్యుడిని కూడా వెంట తెచ్చుకున్నారు. ఎలాగోలా పాటని పూర్తి చేశారు. కాని ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోవడంతో చిరుని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారం తర్వాత తిరిగి చిరు కోలుకున్నారు. పనిపై ఆయనకి ఉన్న నిబద్ధత అది. నిర్మాతలని ఏ రోజు చిరు కష్టపెట్టింది లేదు. అందుకే ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు చిరంజీవిని ఎన్నోసార్లు పొగుడుతుండడం మనం చూస్తూనే ఉంటాం.