Chiranjeevi | సినిమాల్లో మెగాస్టార్ అయినా, నిజ జీవితంలో మానవతావాదిగా పేరు తెచ్చుకున్న చిరంజీవి, తన సేవా కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు అభిమానుల మన్ననలు పొందుతున్నాడు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం, వైద్య సేవలు, ఆక్సిజన్ బ్యాంక్ వంటి ఎన్నో సేవలు ప్రజలకి అందుతున్నాయి. ఆపద సమయంలో ఎన్నో కుటుంబాలకు చిరంజీవి ఆపద్బాంధవుడిగా నిలిచారు.అయితే రీసెంట్గా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 1 కోటి విరాళం ఇచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అభిమానులు షేర్ చేసిన సమాచారం ప్రకారం, చిరంజీవి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చెక్ అందజేశారట. ఇందుకు సంబంధించిన ఫోటోలు, పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ విరాళానికి సంబంధించిన ఏ అధికారిక ప్రకటన చిరంజీవి టీమ్ నుంచి వెలువడలేదు. అలాగే, ఏపీ సీఎంఓ తరఫున కూడా ఈ విషయంపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. విరాళం ఇచ్చారన్నట్లు కొన్ని ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్లు చేసిన పోస్టులు కూడా తర్వాత తొలగించబడ్డాయి. ఈ నేపథ్యంలో అసలు నిజం ఏంటి? చిరు నిజంగా మరోసారి విరాళం ప్రకటించారా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
నిజానికి, 2024 అక్టోబర్లో ఏపీలో భారీ వర్షాలు, వరదల సమయంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ. 1 కోటి విరాళం ప్రకటించి, అదే సమయంలో చంద్రబాబునాయుడిని కలిసి చెక్ అందజేశారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు అప్పట్లోనే వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ పాత ఫోటోలనే తిరిగి వైరల్ చేస్తూ కొత్తగా విరాళం ఇచ్చారనే ప్రచారం జరుగుతుండటంతో అసలు నిజం ఏంటని తెలుసుకోవాలని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి తాను చేసిన సాయం గురించి ఎప్పుడూ ప్రచారం చేసుకోవడాన్ని ఇష్టపడడు. ఇటీవలే తమిళ నటుడు పొన్నాంబళం, తనకు చిరు అందించిన ఆర్థిక సాయాన్ని గురించి మాట్లాడుతూ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ డొనేషన్ వార్తలపై చిరంజీవి టీమ్ నుంచి ఓ క్లారిటీ రావాలని అభిమానులు కోరుతున్నారు.