Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌కు టాలీవుడ్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మరోసారి ఈ హిట్ జోడీ చేతులు కలపడంతో కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ చిరు 158 తో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా కీలక షెడ్యూల్ కొనసాగుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవిపై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
స్టంట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ కథలో కీలక మలుపుగా నిలుస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ యాక్షన్ ఎపిసోడ్లో చిరంజీవి పవర్ఫుల్, డైనమిక్ అవతార్‌లో కనిపించనున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ యాక్షన్ సన్నివేశాల్లో మెగాస్టార్ చిరంజీవి డూప్‌ను ఉపయోగించకుండా స్వయంగా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారని సమాచారం. తన వయస్సును లెక్కచేయకుండా యాక్షన్ సీన్లలో పూర్తి స్థాయిలో పాల్గొంటున్న చిరంజీవి అంకితభావం యూనిట్ సభ్యులను సైతం ఆశ్చర్యపరుస్తోందని టాక్.
ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విజయాలు అందుకున్న ఈ సంస్థ, తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా భారీ స్థాయిలో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే చిరంజీవి–బాబీ కాంబినేషన్ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తోంది. ప్రస్తుతం ‘చిరు 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ సాగుతున్న ఈ సినిమాకు త్వరలోనే అధికారిక టైటిల్‌ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఓ ప్రత్యేక టీజర్‌ను కూడా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎస్. తమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను విజయ్ కార్తీక్ కన్నన్ నిర్వహిస్తున్నారు. భారీ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.