Tillu Square | ‘సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందుకోవడం తేలికైన విషయం కాదు. కానీ హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు మల్లిక్‌రామ్, నిర్మాత నాగవంశీ ఆ ఫీట్ చేసి చూపించారు. అందరూ మెచ్చేలా సీక్వెల్ తీసి విజయం సాధించారు. అదే ఉత్కంఠ, అదే సరదా, అదే నవ్వులు.. ‘టిల్లు స్కేర్’ను బాగా ఎంజాయ్ చేశాను.’ అన్నారు అగ్రహీరో చిరంజీవి. ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతున్న చిత్రం ‘టిల్లు స్వేర్’. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రానికి మల్లిక్‌రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ చిత్రాన్ని చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్బంగా యూనిట్ సభ్యులను ఇంటికి పిలిచి మరీ అభినందించారు.
చిరంజీవి ఇంకా మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం పడిన కష్టం గురించి సిద్ధూ నాకు చెప్పాడు. సమిష్టికృషే ఈ విజయానికి కారణం. నటుడిగా, కథకుడిగా, సంభాషణల రచయితగా ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ప్రధాన కారణమైన సిద్ధు జొన్నలగడ్డను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మంచి సినిమాలను నిర్మిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతూ ఉత్తమ యువనిర్మాతల్లో ఒకరిగా నిలిచాడు నాగవంశీ. ఇది యువతకే కాదు, అన్ని వయసులవారికీ నచ్చే సినిమా’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న వారిలో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు మల్లిక్‌రామ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఎడిటర్ నవీన్ నూలి, రచయిత కల్యాణ్ శంకర్ కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం 68కోట్ల వరకూ వసూలు చేసిందని సమాచారం.