చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. నయనతార కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ‘మీసాల పిల్ల..’ అనే పాటకు మంచి స్పందన లభించింది. చిరంజీవి మార్క్ వింటేజ్ కామెడీతో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.
దీపావళి సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి ైస్టెలిష్లుక్స్తో కనిపిస్తున్నారు. పిల్లలతో కలిసి సైకిల్ సవారీ చేస్తూ ఆయన ఉత్సాహంగా ఉన్నారు. ఆద్యంతం వినోదప్రధానంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర నవ్యరీతిలో సాగుతుందని, శంకరవరప్రసాద్ పాత్రలో ఆయన కావాల్సినంత వినోదాన్ని పండిస్తారని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.