అగ్ర హీరో చిరంజీవి ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తన 158వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం ఇటీవలే పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నది. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది. షెడ్యూల్‌కీ షెడ్యూల్‌కీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా యమస్పీడ్‌లో షూటింగ్‌ని కానిచ్చేస్తున్నారు దర్శకుడు బాబీ. దానికి మెగాస్టార్ కూడా కావాల్సినంత సహకారం అందిస్తున్నారు. ఈ తాజా షెడ్యూల్లో చిరంజీవితోపాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. సినిమాలోని కీలకమైన టాకీ పార్ట్‌ని ఈ షెడ్యూల్లో పూర్తి చేయనున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా పొల్లాచ్చీ షెడ్యూల్‌కి సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అక్కడ కొంత టాకీతోపాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా తీసినట్టు ఈ వీడియో చూస్తే తెలుస్తున్నది. బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరు-బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రెస్టేజియస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర రెండు విభిన్నకోణాల్లో సాగుతుందని ఇన్సైడ్ టాక్. చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్ నటిస్తున్న ఈ సినిమాలో నివేద పేతురాజ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు ప్రకటించాల్సివుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: తమన్.