తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో వినోద ప్రధానంగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’ రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలై అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం తెలుగు రీమేక్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. సుష్మిత కొణిదెల నిర్మాణ బాధ్యతల్ని తీసుకోబోతున్నదని చెబుతున్నారు. మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రీ కొడుకు పాత్రల్లో నటించారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. తెలుగులో మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి నటించబోతుండగా..కొడుకు పాత్ర కోసం ఓ యువహీరోను ఎంపిక చేసుకోబోతున్నారని తెలిసింది. ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ పేరు కొడుకు పాత్ర కోసం ప్రముఖంగా వినిపిస్తున్నది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ప్రస్తుతం మోహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.