Social Media Harassment | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని సోషల్ మీడియా వేధింపులు వెంటాడుతున్నాయి. తనపై, తన ప్రతిష్టపై అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఆయన మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను (Cybercrime Police) ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు తన ఫిర్యాదును అందజేశారు.
చిరంజీవి తన ఫిర్యాదులో ఒక ‘ఎక్స్’ ఖాతా ద్వారా తనపై నిరంతరం తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొందరు వ్యక్తులు తమ చర్యలను ఆపకుండా ఇంకా అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెడుతున్నారని చిరంజీవి ఫిర్యాదులో తెలిపారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, సదరు ‘ఎక్స్’ ఖాతా పోస్టుల గురించి దర్యాప్తు ప్రారంభించారు.
తన పేరు, ఫోటో, వాయిస్‌లను తమ టీఆర్పీ, లాభాల కోసం అనుమతి లేకుండా దుర్వినియోగం చేస్తున్నారంటూ చిరంజీవి ఇటీవల సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో లేదా వాయిస్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అయితే కోర్టు హెచ్చరికలు జారీ చేసినప్పటీకి కొందరు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్‌ను లక్ష్యంగా చేసుకోవడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.