అగ్ర నటుడు చిరంజీవి ఓ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రమిదే కావడం విశేషం. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించబోతున్నారు.
మంగళవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, అల్లు అరవింద్ కెమెరా స్విఛాన్ చేశారు. సినిమా లాంచ్‌కు ముందు మ్యూజిక్ రికార్డింగ్‌ను ప్రారంభించారు. మొత్తం ఆరు పాటలుంటాయని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తెలిపారు. ఇలాంటి అరుదైన, అసాధారణమైన సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని గీత రచయిత చంద్రబోస్ పేర్కొన్నారు.
సోషియో ఫాంటసీ కథాంశంతో భారీ గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, సాహిత్యం: శ్రీ శివశక్తిదత్తా, చంద్రబోస్, రచన-దర్శకత్వం: వశిష్ట.