హైదరాబాద్లో మరో ఫిల్మ్ స్టూడియో షూటింగ్స్ కోసం అందుబాటులోకి రానుంది. దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ‘అల్లు స్టూడియోస్’ను అగ్ర నటుడు చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్తో పాటు ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ ‘అల్లు రామలింగయ్య గారు వేసిన బాటలోనే అల్లు అరవింద్, అల్లు అర్జున్ నడుస్తున్నారు. అల్లు స్టూడియోస్ లాభాపేక్ష కోసం చేసింది అని అనుకోవడం లేదు. ఇది అల్లు రామలింగయ్య గారికి గుర్తింపుగా ఉంటుందని ఆశిస్తున్నా’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ స్టూడియోను లాభాలు ఆశించి కట్టలేదు. తరాలుగా ఉండిపోయే ఒక జ్ఞాపకంగా చూస్తున్నాం’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ…‘ఇలాంటి స్టూడియో ఒకటి కట్టాలనేది తాత అల్లు రామలింగయ్య గారి కోరిక. ఆయన జ్ఞాపకంగా స్టూడియోస్ నిర్మించాం’ అన్నారు.