Bittu Tabahi | మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి (‘బిట్టు తబాహి) అజ్నార్ నదిని తన సొంత ఖర్చులతో, ఒంటరిగా శుభ్రం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నది ప్రక్షాళనకు సంబంధించిన బిట్టు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డచ్ సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’ సీఈఓ బోయాన్ ఆయనకు నెదర్లాండ్స్‌లో ఉద్యోగ అవకాశం కల్పించారు.
అయితే ఈ యువకుడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణంపై ప్రముఖ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. రాజకీయ నాయకులు చేయాల్సిన పనులను ఈ యువకుడు ఒంటరిగా చేసి చూపించాడని, మన దేశంలో కాలువలు, నదులను కలుషితం చేసే వ్యవస్థల మధ్య ఈ యువకుడికి విదేశాలలో మంచి భవిష్యత్తు లభిస్తుందని కొనియాడారు. బిట్టుతో పాటు మరో ఇన్స్టాగ్రామ్ యూజర్ అయిన సెవేంద్ర కూడా తన చుట్టూ ఉన్న జలవనరులను శుభ్రం చేస్తూ వైరల్ కావడంపై చిన్మయి స్పందించారు. భారతీయ యువత ఇలాంటి మంచి ట్రెండ్‌ను సెట్ చేయడం అభినందనీయమని, ఈ ఇద్దరు యువకులకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మ అవార్డులు’ అందించి గౌరవించాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాకుండా, నదులను శుభ్రం చేసే ఈ ఉద్యమానికి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.