Chinmayi | సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన మధుర గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిర్భయంగా స్పందించే వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. మహిళల హక్కుల విషయంలో తరచూ తన స్వరాన్ని వినిపిస్తూ చిన్మయి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. తాజాగా ఆమె చేసిన పోస్టు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ మళ్లీ సినిమాల్లో అవకాశాలు పొందుతున్న నేపధ్యంలో చిన్మయి తీవ్రంగా స్పందించారు.
చిన్మయి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో.. సింగర్ కార్తీక్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌లాంటి వారిని మళ్లీ ఇండస్ట్రీలోకి తీసుకోవడం అంటే లైంగిక వేధింపులను ప్రోత్సహించినట్టే అవుతుంది. అధికారం, డబ్బును దుర్వినియోగం చేసిన వారి చేతుల్లో మళ్లీ అవకాశాలు పెట్టడం సరికాదు. కర్మ సిద్ధాంతం నిజమైతే, అది ఎప్పటికీ వదిలిపెట్టదు అని రాసుకొచ్చింది.దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ , సింగర్ కార్తీక్ లైంగిక వేధింపుల ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జానీ మాస్టర్ కొంతకాలం జైలుకి వెళ్లి, తరువాత బెయిల్‌పై విడుదల అయ్యారు. అనంతరం ఇద్దరూ ఇండస్ట్రీకి కొంతకాలం దూరమయ్యారు. అయితే ఇటీవల మళ్లీ తమ తమ ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయ్యారు. ఈ క్రమంలో చిన్మయి సంచలన కామెంట్స్ చేసింది.
చిన్మయి వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ మద్దతు తెలుపుతుంటే, మరికొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా, చిన్మయి మరోసారి తన నిర్భయ స్వరంతో “మీటూ” ఉద్యమాన్ని మళ్లీ గుర్తు చేసింది. అన్యాయం ఎక్కడ జరిగిన, దాన్ని ప్రశ్నించే స్వరం ఎప్పటికీ మౌనంగా ఉండకూడదు అని చిన్మయి శ్రీపాద స్పష్టం చేసింది.