నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఎం.సి.రాజు నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ‘19ఏళ్ల మెడికల్ స్టూడెంట్ జీవితంలో జరిగిన కథ ఇది. కథ అందించడంతోపాటు నిర్మాణ బాధ్యతను కూడా తీసుకున్న నా మిత్రుడు రాజుకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మారుతీగారు, ఎస్కేఎన్గారు ఈ సినిమా చూసి, నచ్చి మూవీని టేకప్ చేసి వారే విడుదల చేస్తున్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం.’ అని దర్శకుడు అమర్ కామెపల్లి అన్నారు. అన్ని విధాలుగా అందర్నీ ఆకట్టుకునే సినిమా ఇదని నిర్మాత ఎస్కేఎన్ చెప్పారు. ఇంకా పంపిణీదారుడు ధీరజ్ మొగిలినేని, హీరో నిఖిల్ దేవాదుల, రైటర్ డార్లింగ్ స్వామి, ఈటీవీ ప్రభాకర్, హీరోయిన్ అర్వికా గుప్తా తదితరులు మాట్లాడారు.