Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో నటుడిని పోలీసులు ప్రశ్నించనున్నారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె తనయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ను ఏ11 నిందితుడిగా చేర్చారు.
ఈ కేసులో అల్లు అర్జున్ను ఈ నెల 13న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దాంతో బన్నీ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు రెండుగంటల పాటు వాదనలు విన్ని హైకోర్టు.. మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే, ఈ సందర్భంగా నటుడు అయినంత మాత్రాన అతన్ని ఇరికించొచ్చా? అని వ్యాఖ్యానించింది. సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను సైతం నిరాకరించలేమని న్యాయస్థానం పేర్కొంది. ఈ సందర్భంగా 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను ఆపాదించాలా? అని ప్రశ్నించింది. ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంపై బాధనే ఉందని.. అదే సమయంలో అల్లు అర్జున్‌కి కూడా జీవించే హక్కు ఉందని పేర్కొంది. అతన్ని వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే, అప్పటికే పోలీసులు నటుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదే రోజు రాత్రి 10 గంటల వరకు జైలు అధికారులకు పత్రాలు అందకపోవడంతో మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విడుదలైన విషయం తెలిసిందే.
గత రెండురోజులు సంధ్య థియేటర్ తొక్కిలసలాట వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌తో పాటు ఇండస్ట్రీ ప్రముఖలుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా సీఎం పేరు ప్రస్తావించకుండానే అల్లు అర్జున్ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేశాడు. తన వ్యక్తిత్వంపై దాడి జరుగుతుందని పేర్కొన్నారు. బన్నీ ప్రెస్ మీట్ అనంతరం పలువురు మంత్రులతో సహా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. అదే సమయంలో పోలీసులు సైతం వీడియోలు విడుదల చేశారు. అదే సమయంలో పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. తాజాగా మరోసారి చిక్కడపల్లి పోలీసులు బన్నీకి నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎటు మలుపు తీసుకుంటుందోనన్న చర్చ సాగుతుంది.