Chennai Bomb | తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపుల నేపథ్యంలో తమిళనాడు అధికారులు హై అలర్ట్ అయ్యారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలోని అగ్ర నటులైన రజనీకాంత్, ధనుష్ నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి మంగళవారం తెల్లవారుజామున ఒక ఈమెయిల్ అందింది. అందులో చెన్నై పోయస్ గార్డెన్లో ఉన్న రజనీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు, కీల్పాక్కంలో నివసించే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) అధ్యక్షుడు సెల్వపెరుంతగై ఇంటికి కూడా బెదిరింపులు ఉన్నట్లు పేర్కొనబడింది. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, బాంబు స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ల సహాయంతో ఆయా ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఈ పరిణామాల దృష్ట్యా చెన్నై నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తమిళనాడులో ప్రముఖులకు బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో అక్టోబర్ 3న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ నటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయం, డీజీపీ ఆఫీస్ మరియు రాజ్‌భవన్ వంటి కీలక ప్రాంతాలకు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్ 13న మరోసారి ఎంకే స్టాలిన్, రజనీకాంత్ నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. వరుస బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.