Palash Muchhal | ఇండియన్ స్టార్ వుమెన్ క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పలాష్ ముచ్చల్ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా రంగంలో పెట్టుబడుల పేరుతో మోసం చేశాడంటూ అతడిపై మహారాష్ట్రలో తాజాగా ఫిర్యాదు నమోదైంది. సాంగ్లీ జిల్లాకు చెందిన సినీ ఫైనాన్షియర్, నటుడు వైభవ్ మానే పలాష్ తన వద్ద నుంచి సుమారు రూ. 40 లక్షలు వసూలు చేసి మోసం చేశారని పోలీసులను ఆశ్రయించారు.
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి ద్వారా వీరికి పరిచయం ఏర్పడగా, ‘నజరియా’ అనే సినిమా నిర్మాణం కోసం పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఇస్తానని, అలాగే సినిమాలో పాత్ర కూడా ఇస్తానని పలాష్ హామీ ఇచ్చినట్లు బాధితుడు పేర్కొన్నారు. పలాష్ మాటలను నమ్మి ఆన్లైన్ ద్వారా రూ. 40 లక్షలు చెల్లించినప్పటికీ, సినిమా నిర్మాణం పూర్తి చేయకుండా, డబ్బు తిరిగి ఇవ్వకుండా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారని వైభవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ప్రస్తుతం సాంగ్లీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. పలాష్ ముచ్చల్, స్మృతి మంధానల వివాహం ఇటీవలే రద్దు అయిందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ చీటింగ్ కేసు బయటకు రావడం తీవ్ర సంచలనంగా మారింది.