Chandrabose | దేశ సినీ రంగం గర్వించేలా ఆస్కార్ అవార్డ్ సాధించింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాట. ఈ పురస్కారాన్ని సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి వేదికపై స్వీకరించారు గీత రచయిత చంద్రబోస్. ఈ సందర్భాన్ని చూసి సంతోషించిన వాళ్లలో ఆయన కుటుంబ సభ్యులే అందరికంటే ముందుంటారు. ఆ ఆనందాన్ని తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు చంద్రబోస్ సతీమణి సుచిత్ర.
ఆస్కార్ రావడం పట్ల చంద్రబోస్ సతీమణిగా మీరు ఎలా ఫీలవుతున్నారు?
ఆస్కార్ వచ్చింది చంద్రబోస్‌కే నా..అని ఇంకా షాక్‌లోనే వున్నాను. ఇన్ని రోజులు ఆయన్ని ఒకలా చూశాం. ఇప్పుడు ఆయన్ని ఎలా చూడాలి? ఎలాంటి మర్యాదలు ఇవ్వాలో అర్థం కావడం లేదు. పెళ్లి చేసుకున్న రోజులు గుర్తుకు వస్తున్నాయి.. అప్పటి నుండి ఆస్కార్ వరకు ప్రయాణం గొప్ప అనుభూతినిచ్చింది.
ఆస్కార్ ప్రకటన వచ్చిన ఆ మధురక్షణాల్లో మీ ఆనందం ఎలా వుంది?
ముందు రోజు రాత్రంతా నిద్రపట్టలేదు. ఏ సమయంలో ప్రారంభం కాబోతుందో.. ఎలా అనౌన్స్ చేస్తారో.. వస్తుందో? రాదో? రాకపోతే ఏంటి పరిస్థితి? చిన్న భయం వుండేది. కాకపోతే చంద్రబోస్ తనకు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా వుంటారో వేరే వాళ్లకు వచ్చినా అదే ఫీలవుతారు.. ఇక్కడి వరకు వచ్చాం చాలు అనే భావన బోస్ గారిలో వుంటుంది కాబట్టి సరిపోయేది..కాని నేను మాత్రం దేవుడ్ని ప్రార్థించాను. ఆస్కార్ ప్రకటన వచ్చే వరకు ఎంతో టెన్షన్ పడ్డాను.
చంద్రబోస్ ప్రతిభకు ఇప్పటిదాకా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆస్కార్ ఎంత ప్రత్యేకం అని భావిస్తున్నారు?
ఇదంతా గొప్ప ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. మేము పళ్లైన కొత్తలో ఎన్నో ఒడిదొడుకులు చూశాం. అనేక మానసిక పరిస్థితులు ఎదుర్కొని ఇంత దూరం వచ్చాం. ఇవన్నీ తిరిగి చూసుకుంటే దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. చంద్రబోస్ తెలుగు భాషను గాఢంగా నమ్మారు. ఆయనకు విద్య నేర్పిన గురువులు తప్పకుండా గర్వపడతారు. చంద్రబోస్ తల్లిగారు బతికి ఉంటే ఇంకా ఆనందంగా ఉండేది. ఆవిడ తన బిడ్డకు ఆస్కార్ రావడాన్ని కళ్లారా చూసి ఉంటే మా సంతోషం సంపూర్ణం అయ్యేది.
ఆస్కార్ తెచ్చిన గౌరవం, బాధ్యతతో చంద్రబోస్ ఎలాంటి పాటలు రాయాలని మీరు కోరుకుంటున్నారు?
అవార్డ్స్ అనేవి సువాసన వెదజల్లే పుష్పాల్లాంటివి. వాటిని అంతవరకే ఆస్వాదించాలి. తర్వాత మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. వాస్తవంగా చంద్రబోస్ వ్యక్తిత్వం అలాంటిదే. ఆయన పురస్కారాలన్నింటినీ ఒకేలా చూస్తారు. అయితే ప్రపంచంమంతా సంతోషపడుతుంటే చంద్రబోస్ కూడా ఇది చాలా గొప్పదని భావిస్తున్నారు అనుకుంటా. తన ముందున్న పనిని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తారు. తన తొలి సినిమా తాజ్‌మహల్ విజయం సాధించి ఆయనకు పేరు తెచ్చినప్పుడు మాత్రమే అమితంగా ఆనందపడ్డారు. ఆ తర్వాత ప్రతీది సాధారణంగానే చూశారు. ఆస్కార్ తన జీవితంలో మరో మెట్టు అంతే.ఈ పురస్కారాల వెల్లువ ఆగకూడదని సినీ ప్రేమికులు కోరుకుంటారు కదాఅవును, ఆస్కార్ అనేది మా జీవితంలో ఒక మజిలీ మాత్రమే. ఇంకా అనేక పురస్కారాలు రావాలి. జీవితాంతం చంద్రబోస్ పాటలు రాస్తూ సంతోషంగా ఉంటే అదే మా జీవితానికి అతిపెద్ద పురస్కారం.
చంద్రబోస్ పాటల రచనలో మీ సహకారం ఎంత ఉంటుంది?
ఆయనొక సాహిత్య గని. ఆయనకు గీత రచనలో ఎలాంటి సలహాలు ఇవ్వను. చంద్రబోస్ తాజ్‌మహల్ చిత్రానికి పాటలు రాస్తున్నప్పుడు నేను ఆయనతో లేను కదా. పాటల విషయంలో ఇప్పుడూ అంతే. మీ వైవాహిక జీవిత ప్రయాణం గురించి చెప్పండిమేము ప్రేమించి పెండ్లి చేసుకున్నాం. అప్పటిదాకా నా జీవితంలో ఒకరే దేవుడు సాయిబాబా. పెండ్లయ్యాక చంద్రబోస్ మరో దేవుడు అయ్యారు. ఇప్పుడు నా జీవితంలో ఇద్దరు దేవుళ్లున్నారు. ఆయన సాధిస్తున్న విజయాల పట్ల గర్వపడుతుంటా.
ఒక కొరియోగ్రాఫర్‌గా నాటు నాటు పాట డ్యాన్సుల గురించి ఏం చెబుతారు?
నాటు నాటు పాటను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అంతే బాగా పర్మార్మ్ చేశారు. ఈ పాటను పిక్చరైజ్ చేసిన కెమెరామెన్, ఆలోచించిన దర్శకుడు రాజమౌళి..ఇలా నా దృష్టిలో ఈ పాటకు డజను ఆస్కార్ పురస్కారాలు ఇవ్వాలి.
తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం పట్ల మీ స్పందన?
చాలా ఆనందంగా, గర్వంగా వుంది. నేను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న ప్రతి సారి నన్ను తెలుగులో మాట్లాడమని తిట్టేవారు. కానీ నేను ఎప్పుడూ ఇంగ్లీష్‌లో మాట్లాడేదాన్ని. కానీ ఆయన మాత్రం తెలుగు పాటలు రాస్తూ.. తెలుగులో మాట్లాడుతూ ఆస్కార్‌కు వెళ్లడం చాలా గొప్ప విషయం. ఆయన మీద, తెలుగు మీద ఇంకా గౌరవం పెరిగింది.
నాటు నాటు పాట రాయడానికి చంద్రబోస్‌లో ఎలాంటి ప్రయత్నాన్ని గమనించారు?
చంద్రబోస్ చాలా మంది దర్శకులకు పాటలు రాస్తుంటారు. ఆయన ఏ పాటైనా పూర్తి ప్రయత్నంతో రాస్తారు. నాటు నాటు పాటకు కూడా ఎంతో సృజనాత్మకంగా ఆలోచించారు. మనం శ్రమించినా దేనికైనా అదృష్టం ఉండాలంటారు. అలా ఈ పాటకు సమయం కలిసి వచ్చింది. ఆస్కార్ దక్కింది.