భారతీయ పురాణేతిహాసాల ఆధారంగా రూపొందించే చిత్రాల పట్ల ప్రేక్షకులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘మహావతార్ నరసింహ’ చిత్రానికి కన్నడ, తెలుగు భాషల్లో అపూర్వ ఆదరణ దక్కింది. ఇప్పుడు అదే కోవలో అపర పరాక్రమశాలి, సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడి దివ్యగాధ తెలుగు వెండితెర దృశ్యమానం కాబోతున్నది. ‘వాయుపుత్ర’ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ త్రీడీ యానిమేషన్ భక్తిరస చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తారు.
అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైమెంట్స్, ఫార్చూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం అనౌన్స్మెంట్ పోస్టర్ను విడుదల చేశారు. హనుమంతుడి పట్ల అచంచల విశ్వాసాన్ని ఆవిష్కరిస్తూ చరిత్ర, భక్తి, ఆధునిక దృశ్యాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.