‘ఇందులో నాది సీరియస్ అండ్ వైలెంట్ రోల్. అసలు ఆ క్యారెక్టర్లో క్రిష్ నన్నెలా ఊహించుకున్నారో అర్థం కాలేదు. ఆయన పిలిచి కథ చెప్పినప్పుడు అద్భుతం అనిపించింది. నా పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది. కేవలం లుక్ కోసం చాలా టైమ్ తీసుకున్నాను. ఇంతమంచి పాత్ర ఇచ్చినందుకు క్రిష్‌గారికి థ్యాంక్స్.’ అని నటుడు చైతన్యరావు అన్నారు. అనుష్కశెట్టి కథానాయికగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో కీలక పాత్ర పోషించిన చైతన్యరావు శనివారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘ఇందులో నా పాత్ర రెగ్యులర్ విలన్లా ఉండదు. అసలు క్రిష్ నన్ను విలన్లా చూడలేదు. ఒక మెయిన్ క్యారెక్టర్లాగే చూశారు. ఇందులో నా రోల్ కీలకంగా, గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇదొక ఐకానిక్ క్యారెక్టర్. ఈస్ట్రన్ ఘాట్స్‌లో ఈ సినిమాను షూట్ చేశాం. అక్కడ షూటింగ్ ఓ సాహసమే. ఇందులో ఓ జలపాతం సీన్ ఉంది.
చాలా రిస్క్‌తో ఆ సీన్ చేశాం. ఎక్స్ట్రార్డినరీగా వచ్చిందా సీన్. చాలా రిస్క్ చేసి అనుష్క ఆ సీన్ చేశారు.’ అని తెలిపారు. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బావుంటుందని, ‘యమసభ’ సిరీస్, ‘ఘాటీ’ సినిమా నా కెరీర్‌కి రెండు పిల్లర్స్ లాంటివని, ఫహాత్ ఫాజిల్, సత్యదేవ్లా అన్ని రకాల పాత్రలూ చేయాలనుందని, క్రాంతికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని చైతన్యరావు చెప్పారు.