Mahavatar Narsimha | ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. స్టార్ హీరోలు లేని సినిమా ఎప్పుడూ కష్టంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందన్న అభిప్రాయాన్ని ఈ చిత్రం తల్లకిందలు చేసింది. కన్నడలో నిర్మితమైన ఈ యానిమేటెడ్ చిత్రం, తెలుగులో అల్లు అరవింద్ సమర్పణలో విడుదలై విపరీతమైన స్పందన పొందుతోంది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతదేశంలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ సినిమాగా ఘనత సాధించింది.
ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ చిత్రం హౌస్‌ఫుల్ షోలతో కొనసాగుతుండటం విశేషం. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాను వీక్షించారు. ఆగస్టు 15 నాడు అల్లు అరవింద్ మరియు శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి తో కలిసి థియేటర్లో ఈ సినిమాను చూశారు. అనంతరం ఆయన సినిమా గురించి స్పందిస్తూ.. “మన పురాణాలకు చాలా దగ్గరగా ఈ సినిమా ఉంది. భక్త ప్రహ్లాద సినిమాలా ఇది కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. మనుషులతో కాకుండా బొమ్మలతో తీశారు గానీ… ఆ భక్తి, ఆ భావం, ఆ అనుభూతి మాత్రం నిజంగా ఆధ్యాత్మికంగా అనిపించింది.
చివరి సన్నివేశం అయితే అత్యంత అద్భుతంగా ఉంది. ఇది ప్రతి కుటుంబం థియేటర్లో చూసే సినిమా అని ప్రశంసించారు. సామాన్య ప్రేక్షకులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా ‘మహావతార్ నరసింహ’ సినిమాను ప్రశంసిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హోంబలే ఫిల్మ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో చాగంటి గారి రివ్యూ వీడియోను షేర్ చేస్తూ, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. భారీ బడ్జెట్ లేకుండానే గొప్ప కథ చెప్పగలిగితే ప్రేక్షకుల మద్దతు ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి నిరూపించింది. ‘మహావతార్ నరసింహ’ వంటి చిత్రాలు భవిష్యత్తులో మన దేశీయ యానిమేటెడ్ సినిమాలకు మార్గదర్శకంగా నిలవడం ఖాయం.