సిరివెన్నెల కలం ప్రయాణం ఆగిపోయింది. అభిమానగణం కన్నీటిసంద్రమైంది. మూడున్నరదశాబ్దాల పాటు ఆణిముత్యాల్లాంటి పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సీతారామశాస్త్రి మహాభినిష్క్రమణం ప్రతి ఒక్కరి హృదయాల్ని కలిచివేసింది. మంగళవారం సాయంత్రం క్యాన్సర్ సంబంధిత సమస్యలతో సిరివెన్నెల కన్నుమూయడంతో చిత్రసీమలో విషాదవాతావరణం అలుముకుంది. ఆయన మృతదేహాన్ని బుధవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్‌లోని ఫిలింఛాంబర్ కార్యాలయానికి తీసుకొచ్చారు. తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్.. సిరివెన్నెల భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు సిరివెన్నెల సీతారామశాస్త్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెలను కడసారి చూసేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ ఎత్తున ఫిలింఛాంబర్‌కు తరలివచ్చారు. ఉదయం పదకొండున్నర సమయంలో ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. దారిపొడవున అభిమానులు సిరివెన్నెలకు అశ్రునివాళులు అర్పించారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు యోగేశ్వరశర్మ నిప్పంటించారు.