Kota Srinivasa Rao | ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోటా 750కిపైగా చిత్రాల్లో నటించారు. తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్న ఆయనను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కోటా ప్రసాద్ ఉన్నారు. 2010 జూన్ 21న రోడ్డుప్రమాదంలో ప్రసాద్ మృతిచెందారు. కోటా మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
ప్రముఖ సీనియర్ సినీ నటులు, మాజీ MLA, పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. దాదాపు అనేక భారతీయ భాషల్లో 700 చిత్రాలకు పైగా విభిన్న పాత్రల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా గారు ఇకలేరు అనే వార్త సినీరంగానికి తీరని లోటు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారితో కలిసి ప్రాణం ఖరీదు సినిమాతో ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయనతో కలిసి అర డజనుకు పైగా చిత్రాలలో నటించడం ఎప్పటికీ జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
చిరంజీవి
లెజెండరీ నటులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ఆయన, నేను ఒకేసారి సినీ కెరీర్‌ను ప్రారంభించాం. ఆ తర్వాత వందలాది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రనీ తన విలక్షణమైన, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కామెడీ విలన్‌గా అయినా, సీరియస్ విలన్‌గా అయినా, సహాయక పాత్రలైనా.. ఆయన పోషించిన ప్రతి పాత్ర ‘ఆయన మాత్రమే చేయగలడు’ అన్నంత గొప్పగా నటించారు. ఇటీవలి కాలంలో ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది. కోట శ్రీనినివాస రావు గారి లాంటి నటుడి లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రియులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఎన్టీఆర్
కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
రామ్‌గోపాల్ వర్మ
సినీ రంగంలో ఉన్న అతి కొద్దిమంది గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటనతో నా సినిమాలు ‘శివ’, ‘గాయం’, ‘మనీ’, ‘సర్కార్’, ‘రక్త చరిత్ర’ మరింత ప్రభావవంతంగా వచ్చాయి. అది వెలకట్టలేనిది. కోట శ్రీనివాసరావు గారు మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఉండవచ్చు కానీ, మీ పాత్రలు బతికే ఉంటాయి.
రవితేజ
కోట శ్రీనివాసరావును చూస్తూ, ఆరాధిస్తూ.. ఆయన్నుంచి నేర్చుకుంటూ పెరిగాను. ఆయన నా కుటుంబంలో వ్యక్తిలాంటి వారు. ఆయనతో కలిసి పని చేసిన క్షణాలు నాకు తీపి జ్ఞాపకాలు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
బ్రహ్మానందం
కోట శ్రీనివాసరావు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. నటన ఉన్నంత కాలం ఆయన ఉంటారు. కోట శ్రీనివాసరావు నటరాజపుత్రులు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. దాదాపు 4 దశాబ్దాల పాటు మేము కలిసి పనిచేశామంటూ బ్రహ్మానందం కోట శ్రీనివాసరావుతో తమ దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
రాజమౌళి
కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఒక అద్భుతమైన కళాకారుడు, ప్రతీ పాత్రకు ప్రాణం పోసిన గొప్ప నటుడు. తెరపై ఆయన ఉనికి నిజంగా ఎప్పటికీ భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.