బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం రాత్రి నటి కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఆసుపత్రిలో కియారా ప్రసవించినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక కియారా, సిద్ధార్థ్ తల్లిదండ్రులు అవ్వడంతో వారికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక తాము తల్లిదండ్రులైన విషయాన్ని కియారా-సిద్ధార్థ్‌లు సోషల్ మీడియాలో తెలుపుతూ.. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి, మా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. మాకు ఒక ఆడపిల్ల పుట్టింది, ఇది నిజంగా దేవుడిచ్చిన వరం అంటూ ఈ జంట రాసుకోచ్చింది.
‘షేర్షా’ సినిమా టైంలో ప్రేమలో పడిన ఈ జంట 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు కియారాతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సినిమాల విషయానికి వస్తే.. కియారా ప్రస్తుతం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న వార్ 2 చిత్రంలో నటిస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్‌తో కలిసి పరమ్ సుందరి అనే సినిమాలో నటిస్తున్నాడు.