Vijay | తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ పెట్టి భారీ బలప్రదర్శనలు చేస్తున్న విజయ్‌పై తాజాగా కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మధురైలో జరిగిన రాజకీయ సభ సమయంలో అభిమానిపై దాడి చేశారని TVK కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.మధురైలో టీవీకే పార్టీ నిర్వహించిన మానాడు సభకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ను కలవడానికి స్టేజీ వైపు వెళ్లిన శరత్ కుమార్ అనే యువకుడిని బౌన్సర్లు అడ్డుకున్నారు. అయితే, అతడు విజయ్ను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంతో బౌన్సర్లు అతడిని స్టేజ్ నుండి కిందకు పడేశారు
ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన శరత్ కుమార్, విజయ్‌తో పాటు బౌన్సర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో తనపై దాడి చేశారంటూ ఆరోపణలు చేశాడు. దీంతో పోలీసులు విజయ్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దళపతి విజయ్ ఇటీవలే తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు. టీవీకే పార్టీ ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా మానాడు సభలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టంగా ప్రకటించారు.
“రాజకీయాల్లో నాకు అనుభవం లేకపోయినా, భయపడను. ప్రజల కోసం నా సినీ కెరీర్‌ను వదిలిపెట్టి వచ్చా. వారి కోసం పోరాడతా” అని చెప్పుకొచ్చారు విజయ్.అయితే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఇది ఆయన ఎదుర్కొంటున్న తొలి పెద్ద వివాదంగా నిలుస్తోంది. విజయ్ అభిమానిని ఇతర పార్టీల వాళ్లు ప్రభావితం చేసి ఫిర్యాదులు చేయించి ఉంటారని విజయ్ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరి ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.