హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): సినీనటుడు తొట్టెంపూడి వేణు, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు భాస్కర్‌రావు, హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గతంలో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దక్కించుకున్నది. బంజారాహిల్స్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్స్ట్రక్షన్స్ సబ్‌కాంట్రాక్టుకు తీసుకున్నాయి. స్వాతి కన్స్ట్రక్షన్స్ మధ్యలో తప్పుకోవడంతో రిత్విక్ 2002లో పనులు మొదలుపెట్టింది.
ప్రోగ్రెసివ్ , టీహెచ్‌డీసీ మధ్య వివాదం తలెత్తడంతో ఇరుపక్షాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. పనులకు సంబంధించి రూ.1,010.25 కోట్లు టీహెచ్‌డీసీ ఖాతాలో జమ అయ్యాయి. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో రిత్విక్ ఎండీ రవికృష్ణ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతోపాటు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.