Nidhhi Agerwal | హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కొందరు అభిమానులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై సింగర్ చిన్మయి సహా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ అభిమానుల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. బుధవారం (డిసెంబర్ 17) హైదరాబాద్‌లో జరిగిన ‘ది రాజా సాబ్’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ మాల్లో నిర్వహించిన ‘సహానా సహానా..’ పాట విడుదల ఈవెంట్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. నిధి అగర్వాల్‌తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఒకేసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఆమెతో అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం మరింత తీవ్రతరమైంది. పరిస్థితి చేయి దాటడంతో బాడీ గార్డుల సహాయంతో నిధి అగర్వాల్‌ను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కారు ఎక్కిన సమయంలో ఆమె తీవ్ర ఆగ్రహం, మనస్తాపంతో ఉన్నట్లు వీడియోల్లో కనిపించింది. ఈ సంఘటన ఆమెను తీవ్రంగా కలచివేసిందని తెలుస్తోంది. కాగా ‘ది రాజా సాబ్’ చిత్రంలోని ‘సహానా సహానా..’ పాటను బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా, కార్యక్రమం ఆలస్యం కావడంతో మాల్లో జనం మరింతగా గుమిగూడారు. ఇదే సమయంలో ఈ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహించారనే ఆరోపణలతో మాల్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై నిధి అగర్వాల్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే ఆమె పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో అనేక మంది తీవ్రంగా ఎండగడుతున్నారు. మహిళా సెలబ్రిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలవగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.