Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. 500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గిరిజన సంఘాల ఆందోళనతో పోలీసులు కేసు నమోదు చేసారు.ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు కావడం ఇది రెండోసారి. ఇదివరకే సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కారణంతో ఇప్పుడు రాయదుర్గం పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్లు వారు వివరించారు. పహల్గామ్ దాడులను గిరిజన యుద్ధాలతో పోల్చడం.. ఈ కేసులకు కారణమైంది. అయితే ఈ వివాదంపై విజయ్ దేవరకొండ వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు. అయిన కూడా ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు చాలాచోట్ల ఆ సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. మరి ఈ వివాదం ఇంకెంత ముదురుతుందో చూడాలి.
కాగా, షెడ్యూల్డ్ తెగల వారిని ఎంతో గౌరవిస్తూ, వారిని దేశంలో అంతర్భాగంగా భావిస్తాను. వారిని బాధపెట్టే లేదా లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని పోస్ట్‌లో తెలియజేశాడు విజయ్ దేవరకొండ. దేశం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చే సమయంలో, తన సోదరుల వలె భావించే భారతీయులలో ఏ ఒక్క వర్గాన్ని కూడా తాను ఉద్దేశపూర్వకంగా ఎలా వేరు చేస్తాను. నేను ఉపయోగించిన “ట్రైబ్” అనే పదం శతాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తెగలు, కుటుంబాలుగా ఏర్పడి, తరచుగా సంఘర్షణలు పడే కాలాన్ని సూచించే ఉద్దేశంతోనే ఉపయోగించాను. నా సందేశంలో ఏదైనా భాగం అపార్థం చేసుకున్నా లేదా ఎవరినైనా బాధించి ఉన్నా, క్షమాపణలు తెలుపుతున్నానని విజయ్ దేవరకొండ ట్వీట్ లో తెలిపాడు.