Carmeni Selvam | పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో, దర్శకుడు రామ్ చక్రి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక కీలక పాత్రను పోషించారు. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సముద్రఖనితో గతంలో పనిచేసిన తెలుగు దర్శకులు శివ ప్రసాద్, ధనరాజ్, తేజ కాకుమాను అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ, సమాజంలో ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను, ముఖ్యంగా ఈఎమ్ఐల భారాన్ని ఈ చిత్రంలో చాలా సహజంగా చూపించామని పేర్కొన్నారు. “మనం జీవితాన్ని చూసే కోణాన్ని బట్టి మన సంతోషం ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తమ అప్పులను, ఈఎమ్ఐలను తగ్గించుకోవాలని ఆలోచిస్తారు. మనపై ఉన్న ఆర్థిక భారాలను తగ్గించుకున్నప్పుడే మన కలలను నిజం చేసుకోగలం” అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రామ్ చక్రి ఈ కథను ఎంతో ఇంటెన్స్‌గా మలిచారని, లక్ష్మీ ప్రియా మరియు అభినయల నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చిత్ర దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ, సముద్రఖని గారి లాంటి గొప్ప నటుడితో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. ప్రతి సామాన్య కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించామని, అప్పులు లేని జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ సినిమా ద్వారా సందేశం ఇస్తున్నామని తెలిపారు. సంగీత దర్శకుడు రామానుజం మ్యూజిక్‌ను ఒక సేవలా భావించి అద్భుతమైన స్వరాలు అందించారని కొనియాడారు. నిర్మాత అరుణ్ రంగరాజులు మాట్లాడుతూ, పీవీఆర్ ఐనాక్స్ వంటి పెద్ద సంస్థ తమ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్గా ఉండటం సంతోషకరమని, ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ ఆలోచింపజేస్తుందని అన్నారు.
అతిథులుగా వచ్చిన దర్శకులు శివ ప్రసాద్, ధనరాజ్ మరియు తేజ కాకుమాను మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మనిషి జీవితం డబ్బు చుట్టూనే తిరుగుతోందని, మధ్యతరగతి తండ్రి పాత్రలకు సముద్రఖని గారు కేరాఫ్ అడ్రస్‌గా మారారని ప్రశంసించారు. నటీమణులు అభినయ మరియు లక్ష్మీ ప్రియ తమ పాత్రల గురించి వివరిస్తూ, ప్రతి ఇంట్లో ఉండే మహిళల ప్రతిబింబంలా తమ పాత్రలు ఉంటాయని తెలిపారు. లిరిక్ రైటర్ రాంబాబు గోసాల సహా సాంకేతిక నిపుణులు పాల్గొన్న ఈ వేడుక, సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. రాబోయే ఏప్రిల్ 3న థియేటర్లలో ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సందడి చేయనుంది.