ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో మలయాళీ చిత్రం ‘ఆల్ వీ ఇమాజైన్ యాజ్ లైట్’ పోటీలో నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలవడం విశేషం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ముఖ్య విభాగమైన ‘పామ్ డి ఓర్’ అవార్డుల కేటగిరీలో ఈ సినిమా పోటీ పడుతున్నది. గురువారం ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది.
మానవీయ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అక్కడి ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ముంబయిలోని ఓ నర్సింగ్ హోమ్‌లో పనిచేసే ఇద్దరు నర్సులు తమ వృత్తి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సినిమాలో ఆవిష్కరించారు. ఓ రోడ్‌ట్రిప్‌కు వెళ్లిన వారిద్దరు అనుకోకుండా ఓ అడవిలో చిక్కుకుపోవడం, ఆ తర్వాత జరిగే ఉత్కంఠభరిత పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ‘పామ్ డి ఓర్’ కేటగిరీలో పలు అంతర్జాతీయ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ కాంపిటీషన్లో గెలుపొందే చిత్రాన్ని శనివారం ప్రకటించనున్నారు.