Sandeep Reddy Vanga | ‘యానిమల్’ సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శల పర్వం నడుస్తూనే ఉంది. వాటిపై దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తికి సందీప్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 2023లో ‘12th ఫెయిల్’ అనే సినిమాలో నటించారు వికాస్ దివ్యకీర్తి. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా.. సమాజానికి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు అవసరమని, ‘యానిమల్’ లాంటి సినిమాలు అక్కర్లేదని, అలాంటి సినిమాల వల్ల డబ్బు మాత్రమే సంపాదించగలమని, సినిమా తీసేముందు సామాజిక విలువల పాటిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కామెంట్లపై తన రీసెంట్ ఇంటర్వ్యూలో స్పందించారు సందీప్‌రెడ్డి వంగా.
‘ఓ మాజీ ఐఏఎస్ అధికారి నా ‘యానిమల్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు నాకింకా గుర్తున్నాయి. అవి నన్నెంతో బాధించాయి కూడా. అసలు అలాంటి సినిమాలు రాకూడదని అతని అభిప్రాయం. ఆ విమర్శలు నిజంగా నాకు కోపం కూడా తెప్పించాయి. నేను అలాంటి వారికి చెప్పేదొక్కటే. ఐఏఎస్ కావాలంటే కష్టపడి చదివితే చాలు. కానీ ఫిల్మ్ మేకర్ కావాలంటే అభిరుచితో ముందుకు సాగాలి. నీకు నువ్వుగా అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరు. ఇదే విషయాన్ని కావాలంటే పేపర్‌పై కూడా రాసిస్తా.’ అని ఘాటుగా స్పందించారు సందీప్‌రెడ్డి వంగా. ఇంకా తాను రూపొందించనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి మాట్లాడుతూ ‘నాకు ‘బాహుబలి’ని దాటాలని లేదు. అలా చేయాలంటే నా సినిమా 2000కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. అది చాలా పెద్ద విషయం. ఇప్పటికైతే ఓ మంచి సినిమా చేస్తా. అది ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.’ అంటూ సింపుల్‌గా ముగించారు సందీప్‌రెడ్డి వంగా.