Pawan Kalyan | రాజకీయాల్లోకి వెళ్లి ఏపీలో డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయరేమో అని అభిమానులు ఊహాగానాలు చేశారు. కానీ, ఆయన కమిట్ అయిన సినిమాలని పూర్తి చేసి ఫ్యాన్స్‌కి మంచి వినోదం పంచుతున్నారు. ఇప్పటికే హరిహరి వీరమల్లు, ఓజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ , ఓజీ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యాన్స్ కు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ చిత్రం పవన్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పవన్ ఇప్పటికే పూర్తి చేశారు. వచ్చే ఏడాది చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ వరుసగా కొత్త సినిమాలను చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నా, తాజా సమాచారం ప్రకారం పవన్ ఇప్పటివరకు ఏ కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పవన్ తర్వాతి సినిమాల విషయంలో పూర్తి స్పష్టత రాకముందే కొత్త సినిమా ప్రారంభం కానుందనే వార్తలు రావడం వల్ల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 30 ఏళ్ల సినీ ప్రయాణంలో అనేక హిట్లు, కొన్ని భారీ పరాజయాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, హిట్-ఫ్లాప్ కంటే మించిన స్థాయిలో ఆయన అశేషమైన అభిమానగనాన్ని సంపాదించుకున్నారు. డిజాస్టర్ టాక్ ఉన్న సినిమాలతో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించగల స్థామినా పవన్ కళ్యాణ్ సొంతం. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మితమైన ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే రూ.154 కోట్ల వసూళ్లను సాధించగా, మూడు రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ మూవీ నిర్మాతలు లాభాల్లో ఉన్నట్టు సమాచారం.